Thursday, February 10, 2011

ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిగా భావించడంలేదు


ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిగా భావించడంలేదు,
విలీనం లాంఛనం మరో 45 రోజుల్లో పూర్తి
విజయవాడ-గుంటూరులో భారీ విలీన సభ
ఆ తర్వాత కాంగ్రెస్ ఏది చెబితే అది స్వీకరిస్తా
నాగబాబు, పవన్ నా వెన్నంటే ఉంటారు,
ఎ.బి.ఎన్. మెగా డిబేట్‌లో చిరంజీవి


హైదరాబాద్, ఫిబ్రవరి 10 : ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను తాను అనుకోవడం లేదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి స్పష్టం చేశారు. పదవులకోసం అర్రులు చాచడంలేదని, అధికారం అనేది కేవలం అలంకారప్రాయమేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా ఆ మాటకొస్తే చిరంజీవిగా అంతకంటె ఎక్కువే అనుభవించానని కూడా ఆయన వివరించారు. కాంగ్రెస్‌తో ప్రజారాజ్యం పార్టీ విలీనానికి సూత్రప్రాయ ఒప్పందం కుదిరిన అనంతరం తొలిసారిగా ఎ.బి.ఎన్. ఆంధ్రజ్యోతి ఎం.డి. వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన మెగా డిబేట్‌లో పాల్గొంటూ తాను ఏమి చేసినా ప్రజా సంక్షేమం కోసమేనని ఆయన అన్నారు.

కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీల విలీనానికి సంబంధించిన మిగిలిన ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు 45 రోజులు పట్టవచ్చునని చిరంజీవి చెప్పారు. విలీనానికి సంబంధించిన బహిరంగ సభ విజయవాడ లేదా గుంటూరులలో ఉండవచ్చునేమోనని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను అందరివాడిగానే ఉండాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో తానే దళపతినని ఆయన నవ్వుతూ అంగీకరించారు. కాంగ్రెస్‌లో ప్రధాన లోపం స్టార్ కాంపెయినర్ లేకపోవడమేనని చిరంజీవి అభిప్రాయపడ్డారు.

దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ డిబేట్‌లో చిరంజీవి మనసు విప్పి మాట్లాడారు. నా రాకతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఊతం వచ్చిందని కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, ప్రణబ్ ముఖర్జీ వంటివారు ప్రశంసించడంతో సంతోషం కలిగిందని ఆయన చెప్పారు. కొంతమంది కాంగ్రెస్‌వాదులలో వ్యక్తమవుతున్న వ్యతిరేకత గురించి ప్రశ్నించగా అది చాలా తక్కువ శాతమేనని ఆయన అన్నారు.

ఉభయ పక్షాల విలీనం ప్రతిపాదనను ఒక శక్తికి, మరో శక్తి తోడు కావడంగా భావించినట్టు చిరంజీవి చెప్పారు. విలీనం తర్వాత కాంగ్రెస్ నాయకుడు చిరంజీవి అని అభివర్ణించవలసివస్తుందన్నప్పుడు కాంగ్రెస్ నేతగా నన్ను పిలవడమంటే పెళ్లి అయిన తర్వాత ఇంటి పేరు మారినట్టేనని ఆయన ఛలోక్తి విసిరారు. అవినీతిపైనా, కుంభ కోణాలపైనా తన పోరాటం కొనసాగుతుందని చిరంజీవి చెప్పారు.

తన యుద్ధం వ్యక్తులపై కాదని, వ్యవస్థపైనే అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నీతి నిజాయితీలే ఆయుధంగా తాను ముందుకు సాగుతానని ఆయన చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ విలీనం అనంతరం కూడా తన ఆశయాలు కొనసాగుతాయని ఆయన చెప్పారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డి మరణానంతరం ఏర్పడిన రాజకీయ శూన్యతలో కాంగ్రెస్‌కు కొంత అస్థిర పరిస్థితి ఏర్పడిన మాట వాస్తవం అని, ఆ సమయంలో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రత్యర్థులు యత్నించారని ఆయన చెప్పారు. ఈ పరిస్థితులలో ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా, ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తాను ముందుకు వచ్చినట్టు ఆయన చెప్పారు.

వై.ఎస్. మరణించిన అనంతరం అతి తక్కువ సమయంలోనే జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని కొందరు కాంగ్రెస్ నాయకులు వచ్చి మద్దతు కోరడాన్ని జీర్ణించుకోలేకపోయానని చిరంజీవి చెప్పారు. వై.ఎస్. మృతదేహం అక్కడ ఉండగానే, వై.ఎస్. అంత్యక్రియలు పూర్తి కావడానికి ముందే జగన్‌కు మద్దతు ఇవ్వాలన్న ప్రతిపాదన వచ్చినట్టు ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అంగీకరించారు. అలాంటి ప్రయత్నం అమానుషం అనిపించింది. మానవ త్వం కాని ఆ ప్రయత్నాన్ని హర్షించలేకపోయాను. గుండెలో ఇంకా తడిగా ఉంది. అప్పుడే ఆ ప్రయత్నాలు కూడదని చెప్పాను. అప్పటికి మనసులో ఇంకా పచ్చిపచ్చిగానే ఉంది, ఇటువంటి సమయంలో ఇలా అడుగుతారేమిటని బాధ కలిగిందని ఆయన చెప్పారు. అందరూ సంతకాలు పెట్టారు, మీరు కూడా సంతకం పెట్టాలంటే, అది అమానుషం అనిపించిందని ఆయన వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ఎవరి తర్వాత ఎవరు అంటే దానికో పద్ధతి ఉంటుంది, లేదూ కాంగ్రెస్ పార్టీ వంటి చోట్ల పార్టీ అధిష్ఠానం ఉంటుందని ఆయన చెప్పారు.

ప్రజారాజ్యం పార్టీ ఎన్నికలో విజయం సాధించకపోవడానికి తన బాధ్యత లేదని, నమ్ముకున్నవారు నట్టేట ముంచడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాలలోకి వచ్చినందుకు బాధ పడలేదు గాని ఎన్నో సందర్భాలలో మనస్తాపానికి గురయ్యానని చిరంజీవి ఎమోషనల్‌గా చెప్పారు. హరిరామజోగయ్య తాను ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే తెలియదు, గట్టిగా చెప్పాలంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజారాజ్యం పార్టీ నిర్వీర్యమైపోవడానికి బాధ్యత ఆయనది కాదా అని ఆయన ప్రశ్నించారు. పాలకొల్లులో కూడా పోటీ చేయడానికి కారణం హరిరామజోగయ్యేనని అని ఆయన వెల్లడించారు. మీరు ఏమీ చేయనక్కరలేదు, వచ్చి నామినేషన్ వేస్తే చాలన్నవారు, విజయం గురించి భరోసా ఇచ్చి మాట్లాడినవారు ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారని చిరంజీవి నవ్వేశారు. నన్ను రాజకీయాలలోకి రమ్మన్నవారే నట్టేట ముంచారని ఆయన హరిరామజోగయ్య, శివశంకర్ వంటివారిని ఉద్దేశించి చిరంజీవి వ్యాఖ్యానించారు.

నన్ను ఆహ్వానించడానికి ఆంటొనీ తమ ఇంటికి రావడమే కాంగ్రెస్ పార్టీ తనకు ఇచ్చే గౌరవంగా భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూలకూడదనే నాయంతట నేనే ముందుకు వచ్చాను. నా గురించి నేను ఆలోచించడం లేదు, ప్రజలకోసమే ఆలోచిస్తున్నాను, తర్వాత పార్టీ శ్రేణులగురించి ఆలోచిస్తాను అని ఆయన చెప్పారు. సోదరుడు నాగబాబు, పవన్ కల్యాణ్‌ల గురించి అడిగిన ప్రశ్నకు నాగబాబు, పవన్ కల్యాణ్‌లు ఇద్దరూ దేవుడు ఇచ్చిన వరం అని, నాగబాబు రాజకీయాలలో ఉండాలనుకుంటున్నారని, పవన్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు ప్రచారానికి వ స్తాడని ఆయన చెప్పారు. అరవింద్ గురించి అడగగా ఆయన పాత్ర ఆయనకు ఉంటుందని చిరంజీవి చెప్పారు.

భవిష్యత్తులో 150 వ సినిమా గురించి ప్రశ్నించగా ప్రజలకు సేవ చేయడానికి ఇప్పుడున్న బాధ్యతలే ముఖ్యమంటూ అందులోని భాగంగా మంచి కథ దొరికితే ఎందుకు చేయకూడదని ఆయన నవ్వుతూ ప్రశ్నించారు.

చిరంజీవిని రాజ్యసభకు పంపించి, కేంద్ర మంత్రిని చేసి, ఆ తర్వాత ఎన్నికల సమయానికి ఆయనను రాష్ట్రానికి పంపిస్తారన్న అభిప్రాయం గురించి ప్రస్తావించగా, తనకు అటువంటి సంకేతాలేమీ రాలేదని ఆయన చెప్పారు. వరంగల్‌లో జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ గుడ్లు వేసిన చోటే పువ్వులు కూడా వేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. అందువల్ల తాను దేనికీ కుంగిపోయేది లేదని ఆయన చెప్పారు.

నిస్వార్థంగా బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తుంటే విమర్శలు వినవలసి రావ డంతో చాలా బాధ పడ్డానని, ఏ తప్పూ లేదని తమకు ప్రభుత్వం నుంచి యోగ్యతాపత్రం లభించినప్పుడు మీడియా ప్రముఖంగా ప్రసారం చేయకపోవడాన్ని ఆయన కొంత ఆక్షేపించారు. డబ్బులు తీసుకుని టిక్కెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు కూడా బాధించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని చక్కగా నడుపుతున్నారు, ఇంకా నడుపుతారని భావిస్తున్నాని ఆయన అన్నారు. కిరణ్‌కు అండదండలు ఇస్తానని ఆయన చెప్పారు. నైతిక త, అనైతికతపై మాట్లాడే హక్కు నా ఒక్కడికే ఉంది అంటూ సి.పి.ఐ. నాయకుడు నారాయణ చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. అలాగే టిక్కెట్టుకోసం ప్రజారాజ్యం పార్టీ రెండు కోట్లు తీసుకుందని ఒక మహిళ ఆరోపించడాన్ని ఆయనే ప్రస్తావిస్తూ ఆమె ఆర్థిక పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలని, ఎవరు వెనకనుంచి నడిపిస్తున్నారో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారని ఆయన అన్నారు.

వై.ఎస్. హయాంలో అవినీతి జరిగింద న్నది సుస్పష్టం అంటూ ప్రజా సంక్షేమ పథకాల అమలులో అవినీతి జరుగుతోందని, ఈ విషయాన్నే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధికి చెప్పాననీ ఆయన చెప్పారు. భవిష్యత్తులో కూడా తన పోరాటం కొనసాగుతుందని ఆయన చెప్పారు.

నా మెతక వైఖరి నాకు అడ్వాంటేజ్ అనుకుంటున్నాను. అవసరమైనప్పుడు కఠిన వైఖరి కూడా అవలంబించగలను. ఆ రెండవ కోణం కూడా చూస్తారని ఆయన చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలలో 180 సీట్లు వస్తాయనుకుంటే 18 సీట్లే వచ్చినా షేక్ కాలేదు అంటూ ప్రజా శ్రేయస్సే తన పరమావధి అని ఆయన చెప్పారు. మిమ్మల్ని, మీ వాళ్లనీ కాంగ్రెస్ పార్టీ గౌరవప్రదంగా చూసుకుంటామని సోనియా చెప్పారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

నన్ను రాజ్యసభకు పంపిస్తారన్న సంకేతం తనకేమీ రాలేద ంటూ పార్టీ ఏది చెబితే విలీనం తర్వాత అది చేస్తానని ఆయన చెప్పారు. నేను సామాజిక న్యాయం నినాదం చేపట్టిన తర్వాతే రాజకీయంగా, సామాజికంగా సామాజిక న్యాయం అనేది నినాదంగా వచ్చిందని ఆయన చెప్పారు.

take BY: AndhraJyothi

0 Comments:

blogger templates | Make Money Online